డిసెంబరు నెలంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన పండగ వస్తుందీ నెలలో. అదే ధనుర్మాసం. తెల్లవారు ఝామునే లేచి చక్కగా పూజ చేసుకుని ప్రసాదం తీసుకున్నాక రోజు మొదలపెట్టటం అబ్బ. తల్చుకుంటేనే భలే ఉంటుంది. చలి చలిగా ఉన్న సమయంలో చన్నీటి స్నానం, అమ్మ ఆండాళ్ వ్రాసిన పాశురాలు, కమ్మనైన కట్టెపొంగలి (వెణ్‍పొంగళ్), మధ్య మధ్యలో చక్ర పొంగలి (పేర్లు చెప్పి నోరూరిస్తున్నానా?) అంతా అయ్యాక పార్థ సారథి స్వామి దర్శనం (చెన్నైలో ఉన్న రెండేళ్ళుగా బాగా అలవాటైంది) మనసెక్కడికో వెళ్ళిపోతోంది.
అదిగాక నెలాఖరులో నేను పుట్టటం (నాయగనాయ్ పాశురం రోజున, అంటే ఆ పాశురం ముగిసిన రోజున, లేదా తెల్లవారితే మరుసటి పాశురం వస్తుందనగా) ఇవన్నీ ఆనందానుభూతులు కాక మరింకేమిటి? ఇంకా కాస్త ఉంది కాబట్టే ఈటపా. ఈ సంవత్సరం నాకు ధనుర్మాసం జరుపుకునే అవకాశం లేదు. రాదు కూడా. అందుకనే ఆ మధురానుభూతులని అక్షరబద్ధం చేసుకుందామని. మరి నేను ధనుర్మాసంలో పుట్టాను కదా. అందుకే నేమో నాకీ నెలంటే అంత ఇష్టం.
పొద్దున వదిన ఫోను చేసి మాట్లాడింది. తనకి కూడా చంటంటే ఇష్టం. తంబీ అంటూ అభిమానంగా ఉంటుంది. తనతో మాటల సందర్భంలో ఈసారి పుట్టినరోజెలా చేసుకోవాలనుకుంటున్నావు? అని అడిగింది. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ, నాన్న చాలా బాగా సెలెబ్రేట్ చేసేవారు. మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఆయన చేసినంత ఘనంగా వేరొకరు అలా చేయరేమో (అందరు కూతుళ్ళూ అలాగే అనుకుంటారా?) ఏమో మరి మా నాన్నని చూసిన వారెవరూ ఆ మాట అనరు. ;-)
కానీ నిరుడు జరిగినంత బాగా ఎప్పుడూ జరగలేదు. నాకివాళంతా అవే ఆలోచనలు. సాధారణంగా చాలా ప్రాక్టికల్ గా ఎమోషన్‍లెస్ గా ఉండే నేను ఈ నెలలో మాత్రం అలా ఉండలేను. అమ్మ గుర్తొస్తూనే ఉంటుంది. కళ్ళు చెమరుస్తూనే ఉంటయి. నామీద నాకే కోపం వస్తుంది. But last year was entirely different. Dad had nothing to do with my birthday. అప్పుడు నేను పిన్ని కూతురు పెళ్ళిచూపులని హైదరాబాదులో ఉన్నాను.
*** *** ***
హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఎదురుగా చూస్తే తను. చిన్నగా నవ్వాను. చేతులు కట్టుకుని నవ్వుతున్నాడు. క్రితం రోజు చూసిన చిరు గడ్డం లేదు. నల్ల ఎంబ్రాయిడరీ ఉన్న షర్ట్, బ్లూ జీన్స్ వేసుకున్నాడు. ఆశ్చర్యంగా తననే చూస్తూ ఏదో అనబోతున్నంతలో తన వెనగ్గా నాన్న వచ్చారు. నేను లేవబోయాను. తను చొరవగా ముందుకొచ్చి నా తల తన చేతుల్లోకి తీసుకుని అన్నాడు. ఎన్ని విషెస్ కావాలి?
నాకప్పుడు వెలిగింది. ఆరోజు నా పుట్టినరోజని. ఎన్నివ్వగలవు? అడిగాను. లేచి కూచుని. మ్మ్! ఎన్ని కావాలి? మురిపెంగా అడిగాడు. నాన్న మాత్రం అక్కడే నించుని చూస్తున్నాడు అర నవ్వుతో. చంటి నా పక్కన కూచున్నాడు. ఇన్ని. చేతులతో చూపాను. బార్లా జాపి. నాకూ ఆ చిన్నతనపు చేస్టలు గుర్తొచ్చాయి. సరే రా. వెళ్దాము. అన్నాడు. ఈ సమయంలోనా అనే సంశయం నాకు రాలేదు. ఒక్క నిమిషం. అన్నాను. దేనికి? తను అడిగాడు. పళ్ళు తోముకుని, డ్రస్ ఛేంజ్ చేసుకోవాలోయ్ బక్కబ్బాయ్. అన్నాను. హ్మ్! డ్రస్ ఛేంజ్ సరే కానీ, నో దంత ధావనం. అన్నాడు నవ్వుతూ. పాచి నోటితోనే బైటకి? అడిగాను. అప్పుడే పుట్టిన పాపాయిలు పళ్ళు తోముకోరు తెలుసా? నువ్వు తొందరగా వచ్చేయ్. అన్నాడు. నాన్న కూడా తొందర పెట్టటంతో నేను అలాగే డ్రస్ మాత్రం మార్చుకుని వెళ్ళాను. వెళ్ళబోయే ముందు టైమ్ చూస్తే అప్పుడు 3:45 AM.
ఇద్దరం ఆ చలిలో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చాలా రోజులైంది కదా. అందుకే నిన్ను ఈసారికి నాకొదిలెయ్యమని మీ నాన్న గారితో చెప్పాను. అన్నాడు. దారిలో. ఎక్కడిదాకా? అడిగాను. నిన్ను నేను కిడ్నాప్ చేశాను. కిడ్నాప్ ఐన వాళ్ళడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పరు. అన్నాడు సీరియస్ గా. ఓ అవునా నవ్వాను. నేనలా నవ్వుతుంటే సడన్ గా నావైపు తిరిగి నా గడ్డం మీదున్న డింపుల్ మీద ముద్దెట్టాడు. నాకాశ్చర్యం. ఇద్దరం అప్పటికి కల్సి రెండేళ్ళు దాటింది. అప్పట్లో మరీ ఇంత చొరవ ఉండేది కాదు. పైగా ఇన్నాళ్ళలో ఫోనులో కూడా మాట్లాడుకుంది రెండు మూడు సార్లే. నిన్న ప్రొఫెసర్ ఇగోర్ మాథ్యూస్ అంకుల్ వాళ్ళింట్లో చూసినప్పటి నుంచీ తనలో కాస్త మార్పు వచ్చింది. ఇంతకు మునుపిలా ఉండేవాడు కాదని కాదు. కానీ తనలో మరింత చలాకీ తనం.
అలా అలా నడుస్తూ దాదాపూ అసెంబ్లీ దగ్గరకి వచ్చాం. ఇక్కడాగుదామా? అన్నాడు. అక్కడ కాసేపు నించుని కబుర్లు చెప్పుకుంటుండగా తన ఫ్రెండు ఎవరో వచ్చారు. ఆయన పేరు నరసింహన్ ట. (సాక్షి రామన్నయ్య నరసింహన్ వీడు కాదులే అని అప్పుడప్పుడూ ఈమధ్య జోక్ చేస్తుంటాడు). వచ్చి ఏదో డబ్బా ఇచ్చాడు. తను అది తీసుకుని నాకిచ్చి ఓపెన్ చెయ్యమన్నాడు. నేను ఆ భరిణెని అందుకుని చూస్తూ నిలబడ్డాను. ఇంతలో ఒక ఆటో వచ్చి మా ముందాగింది. అందులోంచీ ఒకావిడ దిగింది. తిన్నగా నా దగ్గరకు వచ్చి హాప్పీ బర్త్ డే అని చెప్పింది. నాకాశ్చర్యం. ఎవరావిడా? అని. నన్ను ఆ భరిణె ఓపెన్ చయ్యమని అన్నాడు మళ్ళా. నేను ఓపెన్ చేసి చూద్దును కదా. అందులో ఏదో కలర్ లెస్ లిక్విడ్. కొంచం తెల్లగా ఉంది. ఎప్పుడు చూడలేదది. తాగమన్నాడు. నేను దాన్ని నోట్లో పోసుకున్నాను. భలే రుచి. ఎప్పుడూ చూడలేదది. ఆ వచ్చినావిడ ఆప్యాయంగా నా తల నిమిరి ఆటో దగ్గరకు నడిపించుకుని వెళ్ళింది.
మేమిద్దరం బైక్ మీద వస్తాం. మీరిద్దరూ ఆటోలో వెళ్ళండి. అని చెప్పటంతో వెళ్ళాను.
*** *** ***
ఆవిడతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆవిడ పేరు శైలజా రామనాథన్. నరసింహన్ వాళ్ళ అక్కయ్య. నరసింహన్ చంటి స్నేహితుడు. అప్పుడప్పుడూ మాటల సందర్భంలో వింటమే తప్ప ఛూడటం జరగలేదు. శైలజ గారికి నెల క్రితమే డెలివరీ అయిందట. కూతురు. చంటి నా గురించి చెప్పి అక్కా! కాసిని నీ పాలు ఇస్తే తనకి పుట్టినరోజు బహుమతిగా ఇస్తాను. ఇస్తావా? అని అడిగాడట. వెంటనే ఆమె ఒప్పుకోవటమే కాకుండా నేను అవి తాగేటప్పుడు దగ్గరుంటానని వచ్చిందట. నాకైతే నోట మాట రాలేదు. కాసేపలా ఉండి పోయాను. ఎవరో తమ్ముడి స్నేహితుని కోసం బాలెంతరాలు అంత చలిలో అంత పొద్దున్నే రావటం!!!??? నిజమేనా? అది సరే. ఏదైనా ఖరీదైన బహుమతిస్తారు. ఎంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశామని చూస్తారు. కానీ... వెలగట్టలేని అనుభూతిని నా సొంతం చెయ్యటం? తన ఆలోచనకి నాకైతే ఆనందంతో కన్నీళ్ళొచ్చాయి. ఒక్కసారి మనసారా తనని హత్తుకోవాలని అనిపించింది. తను నరసింహన్ తో ఏదో మాట్లాడుతూ వేరే గదిలో కూచున్నాడు.
శైలజ గారన్నారు. తన వైపు చూపిస్తూ, అలాంటి మనిషి ఉన్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. పైకి చెప్పడు కానీ, భలే అభిమానం తనకి. అనుకోని విధంగా ఆశ్చర్యానందాలకి గురిచేస్తుంటాడు. ఎవరూ ఊహించని రీతిలో. మాకందరికీ తనంటే చాలా అభిమానం. నరసింహన్ కైతే తను ఏది చెపితే అంత. అంతలా ఏముందబ్బా తనలో అని చాలా ఆశ్చర్యంగా ఉండేది నాకు మొదట్లో. వాడు గుండెని తాకే ప్రేమని చూపుతాడు. ఏమీ ఎరగనట్టుంటాడు. అది అనుభవిస్తేనే కానీ తెలియదు. నాకూ ఈమధ్యే అనుభవంలోకి వచ్చింది. నిన్న ఫోన్లో నాకీ విషయం చెపుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. అసలా ఆలోచనలోని క్రియేటివిటీ నాకు భలే నచ్చింది. పుట్టిన రోజు బహుమతిగా అమ్మ పాలు. నాకైతే కళ్ళంబట నీళ్ళు ఆగలేదు. ఒకరకమైన ఉద్వేగం. పళ్ళు కూడా తోముకోకుండా నిన్నిలా తీసుకొచ్చాడంటే నిన్ను ఎంతలా పసిపాపను చేశాడో చూడు. అన్నారు. ఆ మాటలనేప్పుడుఆవిడ కళ్ళలో తడి. లేచి నన్ను ముద్దు పెట్టుకున్నారు. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు. కీర్తి, నువ్వూ. నా పాలు తాగావు కదా... అంటున్న ఆవిడ కళ్ళలో మెరుపు. నా జీవితంలో మర్చిపోలేను.
వెళ్ళొకసారి మాట్లాడు. అన్నారావిడ నాతో. నేను ఆ గదిలోకి వెళ్ళగానే నరసింహన్ బయటకొచ్చాడు. నేనెళ్ళి తన పక్కన కూచున్నాను. Now... how many wishes do you want? అన్నాడు. ఏమనాలో కూడా తెలియక నోట మాట రాకుండా అలా నవ్వుతూనే ఉన్నాను. సో, ఇన్ని చాలా అన్నాడు. నన్ను ఫొటో తీసి, ఆ నవ్వుతున్న భంగిమలో. అప్పుడెప్పుడో నాన్న నరసరావుపేట గడియార స్థంభం దగ్గర తీసిన ఫోటో తర్వాత నాకు బాగా నచ్చిన ఫొటో అది.
ఆరోజు చాలా సేపు వాళ్ళింట్లోనే ఉన్నాను. నరసింహన్ వాళ్ళ అమ్మా, నాన్నా, అందరూ చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. శైలజ గారైతే అన్నం కూడా నన్ను తిననివ్వలేదు. ఆవిడే కలిపి పెట్టారు. చెప్పలేని ఆనందం నా సొంతమైందా వేళ. అమ్మంటే తెలిసిన వాడికే కదా. ప్రేయసి విలువ తెలిసేది. :-)
శైలజ గారు అన్నయ్య పెళ్ళికీ రిసెప్షన్ కీ వచ్చారు. మేమెంత గౌరవించినా నాకావిడ పంచిన ప్రేమకి సరితూగునా?


