img.emoticon { padding: 0; margin: 0; border: 0; } సృజనగీతం: ప్రేమ లేఖలెన్నో... నా మనసు మాత్రం ఎపుడూ నీకై... img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Dec 21, 2009

ప్రేమ లేఖలెన్నో... నా మనసు మాత్రం ఎపుడూ నీకై...

ఏడాది కిందటి విషయం. అప్పటికి మేము కలిసి, అదే ఒకరినొకరం చూసుకుని కూడా దాదాపూ రెండేళ్ళు గడిచి పోయింది. తను చాలా సమస్యలెదుర్కుని ఎలాగో గట్టెక్కాడు. ఫోనులో మాట్లాడుకుని కూడా చాలా రోజులైంది. అందుకే అలా ఒక ప్రేమ లేఖ రాశాను. అందుకున్నాడు, పలకరించాడు.

సంవత్సరం తిరిగింది, తను అనుకున్నవి కొన్ని లక్ష్యాలని పూర్తి చేశాడు. అలాగే నేను కూడా ఒక చిన్న మిస్టేకు తప్ప అన్నీ అనుకున్నట్టుగానే పూర్తి చేశాను. ఇప్పుడెందుకో తను గుర్తొచ్చాడు. కాసేపు ఏదన్నా రాద్దామనుకుంటే ఏమీ తట్టటం లేదు. సరే నా జీవితంలో రాసిన ఏకైక ప్రేమ లేఖని మళ్ళా ఇలా షెడ్యూల్ చేసుకున్నాను. అప్పటి ఫ్లేవర్ మిస్ కాకూడదని, స్పెల్లింగు మిస్టేకులేవీ సరి చెయ్యటం లేదు.

చదవని వాళ్ళు చదవండి. చదివిన వాళ్ళకి మళ్ళా నచ్చితే అంతకన్నానా? :-)

ప్రియమైన నీకు,

ఎలా పిలవాలో గుర్తురాక ఏదో ఇలా సర్దుకున్నాను. బక్కబ్బాయ్.

నాకెందుకో నీకిలా ఒక లేఖ రాయాలనిపించింది. మామూలుగా రాస్తే నీవండుకోవని, నా భావాలని ఇలా మాటల మాలలలో కూర్చుతున్నాను. ఎన్నాళ్ళైంది మనం కలసి. కానీ తమాషా కదూ ఈ రోజులన్నీ ఇట్టే గడిచినాయి. ఎంత exciting సమయం ఇది మన జీవితంలో?

ఏదో చెప్పాలని మరేదో రాసేస్తున్నాను నేను. ఈ మధ్య తడబాటు ఎక్కువ ఐంది. నీ ఊహలతో. తగ్గుతుందిలే నీతో ఒక్కమాటు ఊసులాడితే. అందుకే నీ గురించి రాసుకుంటున్నాను అక్షరాలని నక్షత్రాల్లా పేర్చి ఆకాశానికి నిచ్చెన వేసి, ఎంతో ఎత్తుకెక్కి అంత పైనుంచీ నీకోసం చూడాలని ... ఎంత బాగుందో కదూ!

నిన్ను తలచినపుడల్లా నన్ను పలకరించేవి నీ మాటలే. ఎలా దొర్లిస్తావు నీ కలకండ పలుకులని? అసలిలాంటి అబ్బాయుంటాడా అనేలా. కానీ నీ మాటలు వింటుంటే... ఒక్కోసారి నవ్వొస్తుంది. చిన్న పిల్లాడు వేదాంతం మాటాడితే విన్నట్టు. అ'మాయ'కంగా చిట్టి చూపులూ, ముక్కుమీద కళ్ళజోడూ, చిన్న పిల్లాడిలా ఆ నవ్వొకటి. ఒక్కసారి నేనమ్మనై నిన్ను ఎత్తేసుకుని, హత్తేసుకుని లాలి పాటలు పాడాలనిపించేలా...

ఇంతలోనే ఒక rugged look. Derisive smile. విశ్వంలో క్షణానికో మార్పు జరుగుతుంది ట. అది నీకు నేను explain చేయలేనులే! నువ్వే నాకు చెప్పాలి. తమరి Philosophy లా. ఎందుకో అలా సడన్ గా మౌనమ్ గా మారి మరోలా చూస్తావ్. ఎందుకలా? నీకే తెలియాలి. అందరూ అనేది అదేగా? నాకు తెలుసు. నీ మౌనం వెనుక ఉన్న ప్రళయాగ్ని. కొంగ్రొత్త ఆలోచనలతో సరిక్రొత్త సృష్టి కై ధ్యానం. నీ వేగాన్ని అందుకోలేక నిన్ను నిలకడ లేనివాడంటారు. కానీ నీ నవ్వే సమాధానం. కొంటెగానో... కోపంగానో... భలే నవ్వొస్తుంది అప్పుడు నాకు అవతలి వారి భావాలను చూస్తే.

కానీ నీకొక విషయం చెప్పనా? నువ్వు సీరియస్ గా ఉన్నప్పుడే బాగుంటావు. ఒక కొత్త భావం కలుగుతుంది నాకు. నీకెన్నో సార్లు చెప్పాను. అప్పుడప్పుడూ ఓ సీరియస్ లుక్కేయమని. విన్టేనేగా.

"అమ్మాయిలు నా భుజం మీద తల వాల్చి ఓదార్పు పొందితే బాగుంటుంది. నా ఇగో చల్లారుతుంది. కానీ నాకలా నచ్చదు. వాళ్ళలా తల ఎత్తి నించుంటేనే నాకు వారి అందం తెలుస్తుంది," ఎంత మాటన్నావు? మిగతా మగాళ్ళు నిన్ను చంపేయరూ. చాలా మంది కోరుకునేది ఆ డామినేషన్ ని ఎక్జర్ట్ చేయాలనే కదా! జీవితాన్ని అలా తీసుకునే ఆ అలవోక తనం నిన్ను ఎంత మంది దృష్టిలో పలుచన చేసింది. ఒకసారి ఎవరో ఆ మాటే అంటే... "మంది ఎక్కువైతే మజ్జిగ పలచన ఔతుంది. కానీ ఆ మజ్జిగే ఎందరి దాహాన్నో తీరుస్తుంది." నాకు మళ్ళీ నవ్వొచ్చింది. నిజం వింటే నాకు నవ్వే వస్తుంది. ఒక చిలిపి నవ్వు నవ్వి నా ఎదను మీటుతావు. కానీ ఆ మాటలే చిన్న పిల్లాడిలా తమాషాగా. ప్రేమకి అర్ధం చెప్పావే... ఎంత నిజం! నా అంత నిజం. ఎవరికన్నా అర్ధం కాక పోయినా అదే నిజం. నీ ప్రేమ.

ఎందుకిదంతా అంటావా? 'ప్రేమరా కన్నా...!' అలిసిన వేళ నీ తలంపులే నాకు ఒక గొప్ప టానిక్. అందుకే ఇలా.

ఒక్కసారి సీరియస్ గా ఓ లుక్కేయవూ!

ప్రేమతో...

నీ... (కాదు కాదు నా)

కిరా.

P. S. ఈ సారి మరొక చిన్న కోరిక. మారికాస్త అగ్రెసివ్ గా తాయారవాలని నా ఆశ. అలాగే నీ లక్ష్యాలన్నీ పూర్తిచేయాలని కోరిక.