img.emoticon { padding: 0; margin: 0; border: 0; } సృజనగీతం: ఎడం పెట్టకండి మమ్మల్ని img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Aug 13, 2010

ఎడం పెట్టకండి మమ్మల్ని

"నువ్వా పురచేతి రాత అపుతావా? చెయ్యి విరగ్గొట్టనా?" చేత మీద కర్రతో కొట్టే సరికి నా చేతిలోని బలపం విరిగిపోయింది. నొప్పి భరించ లేక ఒక్కసారిగా ఏడ్చేశాను, చెయ్యి విదిలిస్తూ. ఎడమ చెయ్యి పైన ఎర్రగా కందిపోయింది. కానీ, నేను నొప్పి పుడితే ఓర్చుకోగలను. వెంటనే తమాయించుకుని చేతులు వెనక్కి పెట్టి అలాగే నిలుచున్నాను. కానీ కళ్ళమ్మెట నీళ్ళు మాత్రం ఆగలేదు. 

"ఇంకోసారలా రాశావంటే నిజంగానే చెయ్యి విరగ్గొడతా. పాడు పిల్లా, పాడు అలవాట్లూనూ."

అందులో పాడు అలవాటేమిటో నాకు అర్ధం కాలేదు. ఎందుకు పాడు పిల్లని అయ్యానో కూడా తెలియలేదు. ఇంతలో బెల్ కొట్టటంతో నేను బతికిపోయాను. అతి కష్టం మీద ఎలాగో కుడి చేత్తో పలకని బా౨గులో పెట్టుకుని, అలాగే చూస్తూ నిలుచుని ఉండిపోయాను. కుడి చేత్తో కా౨రేజి బుట్టని పట్టుకుని, కొంచం బరువెక్కువ ఉన్న బా౨గుని ఎడమ చేత్తో లేపాలని ప్రయత్నించినా నొప్పికి చెయ్యి సహకరించలేదు. అట్టాగే నిలుచుని వెక్కుతూ ఉన్నాను. నా తోటి పిల్లలంతా వెళ్ళిపోతున్నారు. నా ఫ్రెండ్సిద్దరికీ ఎందుకు టీచర్ కొట్టిందో అర్ధం కాలేదు. వాళ్ళిద్దరూ నాకోసమని అక్కడే ఉన్నారు. ఎంతకీ నేను బైటకి రాలేదని కాబోలు, అన్నయ్య నేనుండే క్లాసుకొచ్చి, "సృజీ, ఇవాళ మనం బజారుకెళ్ళాలి కదా... ఏంటక్కడే నించున్నావ్? రా వెళదాం అని పిల్చాడు. అంతే అప్పటి దాకా భరాయించుకున్న దు:ఖం తన్నుకుంటూ బైటకొచ్చింది. వెళ్ళి వెంటనే అన్నయ్య కాళ్ళు చుట్టేశాను. 

తనప్పుడు సిక్స్త్ క్లా౨స్. ఏమైందని కంగారుగా అడిగి నా చెయ్యి పట్టుకుని చూశాడు. నా పక్కనే ఉన్న సుజన, లలిత జరిగింది చెప్పారు. "సర్లే మనం పోదాం రా. రేపు నాన్నకి చెప్పి కంప్లైంట్ చేయిద్దాం," అని నన్ను కొంచం సేపాగమని చెప్పి, బైటకెళ్ళి తన బా౨గుని, బుట్టని, తన ఫ్రెండుకిచ్చి, నన్నొక చేత్తో ఎత్తుకుని, ఇంకో చేత్తో నా బా౨గూ అవీ పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. నాన్నొచ్చాక విషయం చెప్పాము. "సరే, రేపు నేనొచ్చి మాట్లాడతాను," అని నా చెయ్యి పట్టుకుని చూశారు. ఎముక మీద తగలటంతో నొప్పి భరించలేనంతగా ఉంది. వేళ్ళు కదిలించటం కూడా ఇబ్బందైంది. మార్నాడు స్కూలుకొచ్చి హెడ్ సార్ తో విషయం మాట్లాడి ఆ టీచర్ ని పిలిపించి అడిగారు. ఆవిడేదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చింది. కాసేపు ఆవిడని మందలించి, వేరే క్లాసుకి మార్చి, మాకు వందనా మాడమ్ ని వేశారు.
***   ***   ***

అన్నయ్య ఉపనయనం టైమది. ఇంట్లో నాయనమ్మతో కూచుని కూరలు తరుగుతున్నాను. ఇంతలో పిన్నీ వాళ్ళ తోడి కోడలు, వాళ్ళ అమ్మా వచ్చారు. "ఈ పిల్లకేంటమ్మా ఎడమచేతి వాటం? ఎన్ని సార్లు చెప్పినా మానుకోదే? హవ్వ హవ్వ. ఎవరైనా ఎడం చేత్తో కూరలు తరుగుతారటమ్మా?" బుగ్గలు నొక్కుకుంటూ ఆవిడ అంటే వంత పాడుతూ వాళ్ళ అమ్మ, "ఆడపిల్లకి ఎడమచేతి వాటం అశుభం. అందుకే కాబోలు పుట్టగానే తల్లిని మింగింది."

ఇంక ఆగలేకపోయాను. "మర్యాదగా వచ్చిన పని చూసుకుని వెళ్ళండి," గట్టిగా చెప్పి నా పనిలో నిమగ్నమయ్యాను. వెనకాల మాత్రం ఈ విషయం గురించి వాళ్ళ మాటలు ఆగలేదు.

"ముడ్డి కిందకి పదేళ్ళు లేవు. ఎంత పొగరో." ఒకళ్ళు.

"మగ పెంపకమమ్మా, మగ పెంపకం. ఆడదిక్కు లేని ఇంట్లో అన్నీ, ఇల్లాగే ఉంటాయి." ఇంకొకళ్ళు.

"పిల్లనిలాగే వదిలేస్తె ఇంకెన్ని రాచకార్యాలు మొదలెడు..." మాట పూర్తి కాకుండానే  అన్నయ్య వచ్చి, "మర్యాదగా మీరు వెళ్ళిపొండి. మా చెల్లిని అనేట్టైతే ఇక్కడ ఒక్క నిమిషం ఉండొద్దు." గట్టిగా అనేసరికి అప్పటికా మాటలు ఆగాయి కానీ, వాళ్ళకి మాత్రం మేమిద్దరం చెడవాళ్లమయ్యాము.  
***   ***   ***

ఇవే కాదు. చిన్నప్పుడు చాలాసార్లు నా ఎడమ వాటం మీద చర్చ జరిగింది. అసలు ఎడమచేతి వాటం ఐతే తప్పేంటో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. పెద్దయ్యాక కూడా పీజీ చదివే రోజుల్లో ఫెమ్మే ఫా౨టాలీ (femme fatale) అని ఒకడు నా బెంచ్ మేట్ ని అంటే అందరం కల్సి లెఫ్టండ్ రైట్ వాయించాము వాడిని. నేను పీజీ చదివే టైమ్ లో మొత్తం నలుగురం అమ్మాయిలముండే వాళ్ళం ఎడమ చేతి వాటంతో.

సాధారణంగా లెఫ్టీస్ పది నుంచీ పదమూడు శాతముంటారు. కొన్ని లెక్కల్లో ఏడెనిమిది శాతమనీ చెప్తారు.
అసలిదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే... నిన్న లిమాలో మేము టెన్నిస్ ఆడాము. మా౨చయ్యాక మా అపోనెంట్స్, "Well played. Your lefties’ angles are difficult to face. Nice game. Keep it up." అన్నారు. ఆశ్చర్యంగా ఇక్కడ పెరూలో ఎడమచేతి వాటాన్ని ఆనందమయ జీవితానికీ, మంచితనానికీ చిహ్నంగా భావిస్తారట. వింటుంటే భలే సంతోషం కలిగింది.

ఎందుకో కానీ, మనవైపు పిల్లలెవరన్నా ఎడమ చేత్తో రాస్తుంటే మాన్పించాలని చుస్తుంటారు. మొదట్లో నాన్న కూడా కుడి చేతి రాత అలవాటు చెయ్యాలని చూసినా నన్ను ఏమీ అనేవారు కాదు. నాకు అలాగే కంఫర్టబుల్ గా ఉంటుందని అర్ధమయ్యాక ఏమీ అనే వారు కాదు. పైగా చాలా సపోర్ట్ చేసేవారు కూడా.

కానీ, కొన్ని వస్తువులు వాడటానికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేది. ఎస్పెషల్లీ, కత్తెర, కూరల పీచు తీసేది, ఇలా కొన్ని వస్తువులు వాడాలంటే బాగా ఇబ్బందిగా ఉండేది. బీబీఎమ్ చదివేప్పుడు కంప్యూటర్ వాడాలంటే మొదట్లో కష్టమనిపించేది. అందులోనూ, మౌస్ చాలా ఇబ్బంది పెట్టేది. రైట్ క్లిక్ బదులు లెఫ్ట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ బదలు రైట్ క్లిక్. తొందరగా అలవాటు పడ్డాను కానీ, ఇబ్బంది మాత్రం ఇబ్బందే. బీబీఎమ్ పైనలియర్లో ఉన్నప్పుడు స్టడీ టూర్ కోసమని మమ్మల్ని జెనీవా తీసుకెళ్ళారు.

అక్కడ మాకిచ్చిన రెసిడెన్స్ లో ఒకతను వచ్చి, "Sind Sie ein Linker?" అని అడిగాడు. కాస్త అటూ ఇటుగా ఆర్యూ ఏ లెఫ్టీ అని.

"ja..." అన్నా సమాధానంగా. (Yes) "Dann können Sie eine Linkskurve Computer," (Then you can use a left hander's computer) అన్నాడు. అలా వెళ్ళి వాడుతుంటే న్యూమెరిక్ కీబోర్డ్ ఎడమ వైపు ఉండటం, మౌస్ బటన్స్ అన్నీ మాకు అనుకూలంగా ఉంటం నచ్చింది. అక్కడే కొన్ని లెఫ్టీస్ ఆ౨క్సెసరీస్ తెచ్చుకున్నాను. 



మధ్యలో కొన్ని సార్లు మామూలు కంప్యూటర్లు వాడాను కానీ, నిరుడు నాకు లెఫ్టీస్ డే విషెస్ చెప్తూ నిషా లెఫ్టీస్ కీబోర్డ్, మౌస్ సెట్ ఇచ్చాక హాయిగా ఉంది. ఇప్పుడు చాలా వరకూ ఏ ఇబ్బందీ లేకుండా లెఫ్టీస్ ఆ౨క్ససరీస్ దొరుకుతున్నాయి. 


ఐనా ప్రపంచ ప్రముఖుల్లో చాలా మంది ఎడమ చేతి వాటం వాళ్ళే. (అమితాబ్, సచిన్, గా౨రీ సోబర్స్, రాఫా నా డల్, వాసిమ్ అక్రమ్, జాన్ మెకెన్రో, మార్టీనా నవ్రతిలోవా, బిల్ క్లింటన్, బారాక్ ఒబామా, చాలా పెద్ద లిస్టుంది. సెలెబ్రిటీస్ లిస్టెక్కడైనా దొరుకుతుంది)

ఐనా చక్కగా మమ్మల్ని కూడా అందరిలాగే చూడకుండా ఎందుకు ఇబ్బంది పెడతారు? కొన్ని చోట్ల సినిస్టర్ ప్రతిరూపంగా చూస్తారు. ఇంగ్లండులో ఐతే పిల్లలని ఎడమచేతి వాటమైతే అదిలించీ, బెదిరించైనా సరే ఆ అలవాటుని మాన్పే ప్రయత్నం చేసేవారట. ఇబ్బందైన ఇలాంటి పన్లని చేసి, ఆ పిల్లల మానసిక పరిపక్వతని దెబ్బతీయటం అర్ధరహితం. 

కొన్ని లెఫ్టీస్ ఆ౨క్ససరీస్ చూస్తారా? 
లెఫ్టిస్టు క్లబ్స్, సొసైటీలు కూడా ఉన్నాయి. నేను యూరప్ లో ఉండే సమయంలో కొంతమంది ఫ్రెండ్స్ మి కలిసి మాలాంటోళ్ళని పోగేసుకుని సరదాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. చిన్నతనంలో తెలియదు కానీ, ఇప్పుడూ మాకో రోజు కూడా ఉంది. INTERNATIONAL LEFT HANDER'S DAY అని. అది ఇవాళే. 

అందుకే మాకందరికీ శుభాకాంక్షలు చెప్పండి. 

మీకో విషయం తెలుసా? Ambidexter అనే మరో రకం కా౨టగిరీ కూడా ఉంది. ఇది మాకన్నా రేరర్ అంటారు కానీ, మేము కూడా కాస్తంత ఈ విభాగంలోకి వస్తాము కూడా. ఎందుకంటే...

ముందసలు ఇదేంటో చెప్పనే లేదు కదా? రెండు చేతులతోనూ సమానమైన ప్రొఫీషియన్సీతో పని చసే వాళ్ళన్నమాట. ఇది కాస్త ఎడమ చేతి వాటం వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే అన్ని సమయాల్లోనూ, లెఫ్టీలకి అనుకూలమైన వస్తువులు దొరకనప్పుడు కొన్ని సార్లు ఫోర్స్డ్ గా కుడి చేత్తో పని కానిచ్చుకోవల్సి వస్తుంది. కంప్యూటర్ మౌస్ లా అన్న మాట. అలా మేము కాస్త Ambidexters అనుకోవచ్చు, కానీ, కొన్ని సార్లు ప్రయత్నించీ, లేక సహజాతంగానో ఇలాంటి వాళ్ళుంటారు. నా శ్రీశ్రీశ్రీ పతి దేవుల వారు కూడా ఈ విభాగమే. ఆటల్లోనూ, బరువులు లాంటివి మొయ్యటంలోనూ, రెండు చేతులూ, కొన్ని సార్లు లెఫ్ట్ డామినేషనే. ఒక్క రాయటంలోనే కాస్తంత తక్కువ. 

కనీసం ఇప్పటికైనా లెఫ్టిజమ్ అనేది ఒక సహజమైన హార్మోనల్ ప్రక్రియ అనీ, అది కూడా కుడి చేతి వాటంలానే అనీ, ఆ అలవాటు తప్పు కాదనీ గుర్తిస్తే బాగుంటుంది. నిన్నో ఫ్రెండుతో చాట్ చేస్తూ, "రేపు మా లెఫ్టీస్ డే," అంటే "మీకు ఇదొక్కటే రోజు, మిగిలిన మూడొందల అరవైనాలుగు రోజులూ మావేగా, వియారాల్వేస్ రైట్." అన్నది. అంటే మేము రాంగ్ అనా?

హ్మ్! అదండీ మా కష్టం. 

But I am very proud to be a leftie. 
ఎందుకంటే దేవుడు నాకు పుట్టుకతో ఇచ్చింది. దాన్నెందుకు ఎవరో ఏదో అన్నారనీ, అంటారనీ వదులుకోవాలి?
మరి Ambidexters కి ఒక రోజు ఉందా? సాయంత్రం లెఫ్ట్ హాం౨డర్స్ సెలబ్రేషన్స్ కి మాకు ఆహ్వానం అందింది. టాటా :)

ఈసారి కొన్ని సైన్టిఫిక్ ఫా౨క్ట్స్ తో టపాయిస్తాను