img.emoticon { padding: 0; margin: 0; border: 0; } సృజనగీతం: దుర్గ: Dad I Love You img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Aug 11, 2010

దుర్గ: Dad I Love You

దుర్గ గారు వాళ్ళ నాన్న గురించి చెపుతుంటే ఎందుకో నాకా ఎమోషన్, ఆ చెప్పిన తీరూ నచ్చాయి. ఎంతైనా నాన్న కూతురుని కదా. అందుకే ఆ కబుర్లన్నీ ఇక్కడ పెడుతున్నాను. 

ఎక్కడా ఎడిటింగ్ కానీ, స్పెల్ కరక్షన్స్ కానీ చెయ్యలేదు. డెలిబరేట్ గానే.

అనుభూతులని ఎడిట్ చెయ్య కూడదని నా భావన. మీరూ ఆ నాన్న పరిమళాన్ని ఆస్వాదించండి... 

This is the first and the last post in సృజనగీతం not by me or Chanti or Dad. I hope you will enjoy this expression, and appreciate it

నాన్న అంటే తన చిన్నారులకు, ఫ్రెష్ పాలు కావాలని గేదేలను కొని,
పెరట్లో వుంచి వాటి పని  చేసి, పాలు పితికి, కాచి తాగించేవాడు,
నాకు మా తమ్ముడికి 10 నెల్ల తేడా అందుకని అమ్మ పసివాడిని
తనదగ్గరవుంచుకుంటే, ఇద్దరమ్మాయిలను తను చూసుకునేవాడు.
అర్ధరాత్రి లేచి ఏడ్చినా స్టవ్వు, గిన్నేలో పాలు, కడిగిన పాలసీసా రెడీగా వుంచుకుని అప్పటికప్పుడు కాచి
తాగించేవాడు కాని ముందే సీసాలో పోసేసి వుంచి కాస్త వేడి చేసి పట్టేవాడు కాదు.
పెద్దమ్మాయికి కొంచం ఉబ్బసం వుండేదని ఒక మేకను తీసుకొచ్చి,
దాని పాలు పితికి పట్టేవాడు,
పిల్లలు పుట్టే సమయానికి సొంత ఇల్లు కొన్నాడు, నాన్న మెటిరియలిస్టిక్ కాదు,
పెరట్లో అన్ని రకాల చెట్లు, రెండు కొబ్బరి చెట్లు ఒకటి పెరట్లొ, ఒకటి
ఇంటిముందర, మామిడి, జామచెట్లు, నిమ్మచెట్లు, వుసిరికాయ,
అరటిచెట్లు, బొప్పాయి చెట్లు, అంజూర్ చెట్లు పెట్టి వాటిని జగ్రత్తగా
పెంచి, పిందెలు వేయగానే వాటికి చిన్న డబ్బాలు కట్టి, ఒకో పండు పండినప్పుడు, ఒకోసారి, ఒకొక్కరికి
తినిపించి మా మొహల్లో సంతోషం చూసి ఆనందపడిపోయే వాడు. ఇళ్ళల్లో ద్రాక్ష పందిళ్ళు విన్నారా యెక్కడైనా మీరు?
ఇంటి  నాలుగు వైపుల నుండి ద్రాక్ష  చెట్లు పెట్టి, అవి తీగలొచ్చేలోగా, డాబాపైన
పందిళ్ళు వేసి పాకించేసేవాడు, అవి గుత్తులు గుత్తులు ద్రాక్ష పళ్ళు కాస్తే, ఇంట్లో
వాళ్ళకే కాదు, తన పిల్లలతో సమంగా మేనకొడళ్ళు, మేనల్లుళ్ళు, అన్నయ్య, తమ్ముడి
పిల్లలు తినాలని ఇంట్లో ఏ పళ్ళు కాసినా అందరికీ తీసుకెళ్ళి ఇచ్చిరావాల్సిందే,
కొబ్బరి చెట్టు కి కల్పవృక్షం అని ఎలా పేరో, మా ఇల్లు కూడా అలాగే అందరికీ
ఆశ్రయం అయ్యింది.
మా చినప్పుడు, మా అత్తయ్యల పిల్లలు ఇంట్లో వుండి చదువుకోవడం, వుద్యోగాలు
వచ్చిన తరవాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళు జీవితాల్లో స్థిరపడితే చూసి సంతొషించాడు,
ఇంటిముందర పారిజాతాలు, మందారాలు, డిసెంబెర్ పూలు, కనకాంబరాలు,
మేము పెట్టుకోవడమే కాదు అందరికి ఇచ్చేవాళ్ళం కూడా.,
అమ్మ శ్రావణ మాస పూజలకు పారిజాతాలు మేము తెల్లవరుఝమ్మున లేచి
పారిజాతాలు యేరి దండలు కట్టి పెట్టడం, జామపళ్ళు, దానిమ్మపళ్ళు, కొబ్బరికాయలు,
మామిడాకు, బంతిపూలు ప్రతీది మా ఇంట్లోనే వుండేవి.
నాన్న మాకు చదువు చెప్పించాడు, నాకు యుక్తవయసొచ్చేసరికి
నాకు సాహిత్య పఠనంతో, చుట్టూ పరిసరాలు చూసి నాకంటూ ఒక
వ్యక్తిత్వం ఏర్పడుతున్న రోజులు, వరకట్నం తీసుకునేవాడిని చేసుకోను
అని నేను భీష్మించుక్కుర్చుంటే, ఇద్దరిమద్య జనరేషన్ గ్యాప్ వల్ల
వాగ్విదాలు జరిగేవి, నాకు కోపం వచ్చి ఒక్క పూట తిండి మానేసినా,
నాన్న తట్టుకునేవాడు కాదు, అన్నం తినమ్మ, అసలే బక్క ప్రాణం తిండి
తినకపొతే నీరసపడిపోతావమ్మా,' అనేవాడు నాన్న ఆప్యాయంగా.
'కట్నం నేను కదా ఇచ్చేది, నీకేమిటి బాధ,' అనేవాడు,
'నా మనసొప్పుకొదు నాన్న,' అంటే, 'నీకు కట్నంగా వుపయొగపడకపొతే
ఆ డబ్బంతా నేను జూదమాడుతాను, లేకపొతే దానం చేస్తాను,'
అనేవాడు మొండిగా,  ఒక్క చెడు అలవాటు లేని నాన్న.
'నీకెందుకే అంత మొండితనం,' అంటే 'నేను నీ కూతురినే
కదా,' అనేదాన్ని,
మొత్తానికి కట్నం వద్దనే వరుడు దొరకగానే యెంత సంబరపడిపోయాడో,
చిన్నికి కావల్సినట్టుగా మంచివాడు దొరికాడు నాకదే సంతోషం అన్నాడు
నాన్న.

నాకు చిన్నప్పుడు అపెండిసైటిస్  సర్జరి జరిగి 3 రోజులు యెవ్వరినీ లోపలికి రానివ్వరని అంటే
తను అట్లా వదిలిపెట్టి వెళ్ళలేనని నాన్న అంటే,
దాశరథి మామయ్య వుస్మానియా హాస్పిటల్ సూపరిండెంట్ తో మాట్లాడి పెర్మిషన్ తీసుకుంటే ఐసియు  లోకి
వచ్చి కూర్చోవడానికి కుర్చీ కూడా లేకపోతే తనకు వచ్చిన స్తోత్రాల్లన్నీ చదువుతూ, ప్రార్దిస్తూ అలాగే నిల్చుని వున్నాడు
నాకోసం పిల్లలంటే పిచ్చి ప్రేమ వున్న మా బంగారు నాన్న.

2001, అమెరికాలో నాకు మేజర్ సర్జరీ  జరిగి ఐసియు  లొ వున్నప్పుడు 'నాన్న, నాన్న,' అనే కలవరింత.
2005, నాన్న, అమ్మ, మావగారు కలిసి నన్ను చూసి కొన్నాళ్ళు వుండి వెళ్ళడానికి వచ్చిన కొత్తలో నా బాధ
చూడలేక కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భాల్లెన్నొ,
నేను, ఇప్పుడు పరవాలేదు నాన్న, మాకు అలవాటైపోయింది అంటూ అ కళ్ళలొకి చూస్తే
అర్ధం అయ్యింది, కన్న కడుపు కదా ఆ బాధని నేను తీసేయలేనని, అమ్మయినా, నాన్నయిన, పిల్లలు అనందంగా
వుండాలనే అనుకుంటారు కాని, ఒకోసారి అలా జరగకపోతే వారి మనసు ముక్కలవుతుంది.
ఫొన్ చేసినప్పుడల్లా, 'నొప్పి తగ్గిందా అమ్మా, కొంచం అన్నం తింటున్నావా?' అని అడిగేవాడు, ఒకోసారి
పర్వాలేదు నాన్న అంటే సంతోష పడేవాడు.

మేము డిసెంబెర్లో వస్తున్నాము అంటే ఎంతో మురిసిపోయాడు,
'మొత్తం అందరం కలసి తిరుపతి వెళ్ళాల్లమ్మా,' అంటే, 'తప్పకుండా  నాన్న,'
అన్నందుకు గడ్డం కూడా పెంచుకోవడం మొదలు పేట్టాడు నాన్న, అక్కడ మొక్కు తీర్చుకోవడానికి.
నాకు పెద్ద జుట్టు వుండేది వొంట్లో బాగా లేక జుట్టు పోషణ సరిగ్గా చేయలేక
కట్ చేసుకున్నాను.   ఎండాకాలం రాగానే భుజాలవరకు వచ్చే జుట్టు కట్ చేయించుకుంటాను,
కాని ఈసారి ఇండియా వెళ్తున్నాం కదా అని, నాన్నకి నేను
జడ వేసుకుంటే ఇష్టమని కూడా కట్ చేసుకోలేదు.
కొన్ని నెలలయితే వెళ్ళి నాన్న అన్నట్టుగా తిరుపతి వెళ్ళేవాళ్ళం, నాన్నతో సమయం
గడిపేవాళ్ళం.

నాన్న వయసు 88 సంవత్సరాలు కాని ఏ రకమైన అనారోగ్యం లేదు.
అందుకని నాన్న ఈజీగా 90 దాటి 100కి దగ్గరవరకైన వుంటాడనుకున్నాను. 
వృద్దాప్యంలో ఒకోసారి తనకి, తన మాటకి యెవ్వరూ గౌరవం ఇవ్వటం లేదని వుడుక్కునేవాడు.  మా దగ్గర 6 నెల్లు వుంటామని
వచ్చిన మనిషి రెండు నెలలు కాగానే వెళ్తానని గొడవ మొదలు పెట్టాడు.  అమ్మని విసుక్కునేవాడు, అదీ ఒకోసారి కాసేపే వుండెది,
ఒకోసారి కొన్ని రోజులుండేది, వృద్దాప్యాంలొ వచ్చే కోపతాపాలు అవి అంతే.
అందరూ బాగుండాలని, సంతోషంగా వుండాలని కోరుకునే మంచి మనసున్న మనిషి మా నాన్న.

నాన్నకి కష్టపడి పని చేయటం తెలుసు, నిజాయితీగా బ్రతకడం తెలుసు,
నాన్న పొజిషన్లో వున్న వేరే వాళ్ళు కార్లు, ఇంటినిండా ఫర్నీచర్, బ్యాంక్ బ్యాలన్స్,
బోలెడంత బంగారం, పిల్లలకి ఒకొక్కరికి ఫ్లాట్సు, ప్లాట్లు, ఇళ్ళు కొన్నారని నాన్న నిజాయితీనీ చేతకానితనంగా
ఎత్తి చూపించేవారు కొంతమంది.

నేను సెలవు రోజుల్లో ఇల్లంతా సర్ధి క్లీన్ చేస్తుంటే చూసి, 'నేను చిన్నప్పుడు
ఇలాగే చేసేవాడినమ్మా,' అంటూ తన చిన్ననాటి కబుర్లు నాతో పంచుకునేవారు.
కొన్ని విషయాలు నాతో పంచుకున్నవి అవి పెద్ద రహస్యాలని కాదు, వుదాహరణకి,
'ఇంట్లో  ఏ ఫంక్షన్ అయినా నా కళ్ళు తలుపువైపే చూస్తుంటాయి, అందరూ వస్తారు
కాని నువ్వు రావటం లేదే, చైతన్య, స్ఫూర్తి  తాతా అని రావడం లేదే అనిపిస్తుంది,'
అని చెబుతుంటే నాకు కన్నీరు ఆగేది కాదు.
నాకు పాప పుట్టినప్పుడు, ఆరోగ్యం దెబ్బ తిని ఆపరేషన్లు జరిగి ఇంటికొచ్చి ఫొన్ చేసి మాట్లాడితే,
'ఎట్లా వున్నావమ్మా?' అని ఏడ్చేసేవారు.

రెండు వారాలు కూడా కాలేదు నాన్నతో మాట్లాడి కాని ఇప్పుడు నాన్న లేడు అనుకుంటే ఇప్పుడే ఒక్కసారి చూడాలని,
మాట్లాడాలని పిచ్చి కోరిక. ఎక్కువగా మాట్లాడాలనిపిస్తుంది.
నాన్నకు నాకున్న అనుభందం మా ఇద్దరికే తెలుస్తుంది, ఆయనకు మరిద్దరి పిల్లల మద్యన వున్న  అనుబంధం వాళ్ళకే తెలుస్తుంది. 
ఇంకొన్నాళ్ళల్లో అందరం కలిసి సరదాగా సమయం గడుపుదాం అనుకున్నాం. ఆ మృత్యువుకి అస్సలు దయలేదు,
అంత కఠినంగా తీసుకెళ్ళిపోవడం, మాకు కనీసం ఆఖరి చూపు కూడా దక్కకపోవడం వల్ల మనసు మరింత క్షోభతో
కుమిలిపోతుంది.  నాన్న ఙ్ఞాపకాలు, నాన్నతో గడిపిన ప్రతీ క్షణం నా మదిలో నిక్షిప్తమయి వుంటుంది.
  
నాన్నా, అందరూ నీకు వీడ్కోలు చెప్పమంటున్నారు కాని నా మనసులో ఎప్పటికీ వుండేవాడివి నీకు వీడ్కోలేమిటి?   తండ్రిగా, భాద్యాతయుతమైన
మనిషిగా నీ జీవితం ఎంతోమందికి ఆదర్శం, స్ఫూర్తిదాయకమవుతుంది.

-దుర్గ-