img.emoticon { padding: 0; margin: 0; border: 0; } సృజనగీతం: ................................ Dad............................ :-) img.emoticon { padding: 0; margin: 0; border: 0; }

Sep 9, 2010

................................ Dad............................ :-)

అప్పుడే అరవై ఆరేళ్ళైపోయిందట నాన్న పుట్టి!

ఏదో నిన్న మొన్న జరిగినట్టుంది నాకైతే :-) (కాసేపివాళ నాన్నకమ్మనిలే. అందుకే ఇలా).

నాన్నతో నా అనుబంధం పేగు బంధానికన్నా ఎక్కువ. అవును మరి. నేను పుట్టిన కొన్ని నిమిషాలయ్యాక చేతుల్లోకి తీసుకున్నాక, ఇక నేను ఆ చేతుల్లోనే ఉండాలని రాసిపెట్టి ఉంటే, దాన్ని అయన చాలా చాకచక్యంగా గొప్పగా భావిస్తే, నన్ను కడుపులో పెట్టుకుని చూసుకుంటే, తన ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకుంటే, నాకు మాటల్లో చెప్పటం రావటం లేదు కానీ, అమ్మైనా, నాన్నైనా, అన్నీ తనే నాకు. అందుకే పేగు బంధానికన్నా ఎక్కువ. 

వంటరి సంసారం. అడ దిక్కు లేదు. ఏదైనా తోడుండేది, పని చేందుకు సాయం వచ్చేదీ, నాకన్నా ఏడేళ్ళు పెద్ద వాడైన అన్నయ్య. కాలేజ్ కెళ్ళే ముందే నాకు నీళ్ళు పోసి, జడేసి, అన్నం తినిపించి, బాక్స్ పెట్టిచ్చి, అన్నయ్యతో పాటే నన్ను బడికి పంపేసి, మళ్ళ సాయంకాలం రాగానే గబా గబా మాకు ఆకలెక్కడ వేస్తుందో అని ఏదన్న కొనుక్కుని వచ్చి, అవి తినేలోగా మళ్ళా, వంట కానిచ్చి, మా హోమ్వర్కులు చేయించి, కబుర్లు చెపుతూ అన్నం పెట్టి నిద్ర పుచ్చాక, అప్పుడు! తన గురించి కాస్త ఆలోచించుకునే సమయం. అమ్మ డ్యూటీ, నాన్న డ్యూటీ అన్నీ తనే. 

నాకు ఆరేళ్ళొచ్చాక కాస్త కాస్త పరిస్థితులు అర్ధం కావటం మొదలెట్టాక, చిన్నగా పన్లు నేర్చుకుంటూ నాన్నకి సాయం వెళ్ళే దాన్ని. చకచక పన్లు ఎలా చేసుకోవాలో నాన్నని చూసే నేర్చుకునే దాన్ని. నా స్నేహితురాళ్ళ ఇళ్ళలో బడి టైమప్పుడు జరిగే  ఫైటింగ్స్  చూసినప్పుడు ఆశ్చర్యం కలిగేది. పొద్దునే లేచి పూజ చేసుకుని, వంట చేసి (ఎనిమిదేళ్ళు వచ్చాక వంట బాధ్యత నేను తీసుకున్నాను. పై పనులు అన్నయ్య చేస్తే, నాన్న పూజ చేసి, కూరలు తరగటం లాంటివి పంచుకునే వాళ్ళు), మాకు స్నానాలు చేయించి, బట్టలు తొడిగి, తన కాలేజ్ కి కావలసిన వర్క్ చూసుకుని, మమ్మల్ని బళ్ళో దింపి, తన దారిన తను పోవటమంటే మాటలు కాదు. ఎంత ఓపిక కావాలి? ఎంత నేర్పుండాలి? ఆ నేర్పునే మాకు అందించాడు నాన్న. పన్లు చెయ్యటమంటే అదో ప్రాబ్లం సాల్వింగ్ లాంటిది. పెద్ద ఫన్ అనే మనస్తత్వాన్ని చిన్నతనం లోనే అలవర్చారు. అన్ని సందర్భాల్లోనూ తను అందుబాటులో ఉండక పోవచ్చు కనుక, ఎలాంటి పరిస్థితులనైనా  ఎదుర్కునే ధైర్యాన్ని నూరిపోశారు. 

దేనికైనా స్వయంగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకునేలా ప్రోత్సహించారు. ఏ  విషయం లోనూ భయాన్ని నేర్పలేదు నాన్న. నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన భలే జ్ఞాపకం నాకు. నాకు మొదటి నుంచీ దూకుడెక్కువ. గోడలూ లాంటివి తేలిగ్గా ఎక్కేసే దాన్ని. ఒక సారి నాన్న ఫ్రెండ్ ఒకరు వచ్చారు. అప్పుడే పూలు కోయటానికని నేను ఇంటి ముందున్న గోడ ఎక్కాను. "చందూ, పిల్ల అలా గోడ ఎక్కేస్తోంది. పడిపోతుందేమో..." అంటున్నారు. దానికి నాన్న చెప్పిన సమాధానం... "పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. తనకి ఎక్కేటప్పుడు తెసుకునే జాగ్రత్తలు చెప్పాను. అంతే కానీ, ఎక్కితే పడిపోతావని చెపితే తన పరిధి అక్కడే ఆగిపోతుంది." ఎంత మంది పిల్లల గురించి అలా ఆలోచిస్తున్నారు? నేను చూస్తున్నప్పుడే పిల్లలు గోడ ఎక్కారానో, ఇంకెందుకనో పిల్లలని అరవటం, కొట్టటం లాంటివి చేశారు. అయన మాటలు, నన్ను నాకొక పరిధిని ఏర్పరచుకుని, భయాలని ఏర్పరచుకుని ఉండేలా కాకుండా ప్రతి దాన్నీ విశ్లేషించి చూడటం అలవాటు చేశాయి.

However difficult the task may be, there always exists a solution. All we have to do is to find it. సాధ్యం కాదు అనుకుని దేన్నీ వదిలేయ్యకూడదు. ఇదీ నాన్న మాకు ఎప్పుడూ చెప్పే మాట. ఇవాళ నేను ఇదీ అని  గర్వంగా  చెప్పుకునేలా ఉన్నానంటే కారణం నాన్న, ఆయన నేర్పిన పద్ధతులు. Self discipline, self control, and enjoying everything that we are doing. అప్పుడు ఏపనైనా మనకి కష్టమనిపించదు.

ఎంసెట్ రాంక్ వచ్చినా, బీబీఎం చేస్తానంటే నా ఆలోచనని, నేను ఇచ్చిన వివరణని గౌరవించారు కానీ ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆయన పెంపకం మీద ఆయనకి అంత నమ్మకం! ఎంత కష్టమైనా పది, మేము కోరిన చదువునే చెప్పించారు.

ఇంకో సంఘటన! భలే ఉంటుంది. ఒకసారి ఇంట్లోకి పాము వచ్చింది. నల్లగా పొడవుగా పడగ విప్పి ఉందది. అప్పటికి ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడే బడి నుంచీ వచ్చాను నేను. అన్నయ్య కాలేజ్ నుంచే రాలేదు. తాళం తీసి లోపాలకి వెళ్ళగానే దొడ్లో కనిపించింది. వెంటనే దాని మీదకి పరిగెత్తాను. పట్టుకుందామని. అది బుసగొడుతూ మీదకి వస్తోంది. నేను కూడా వెనక్కి తగ్గకుండా వెళుతూనే ఉన్నాను. ఇంతలో నాన్న వచ్చి, నన్ను పక్కకి నెట్టేసి, ఎడమ చేత్తో దాన్ని పట్టేసుకున్నారు. అన్నారు కదా, "అలా మీదకి వచ్చినప్పుడు ఒక సైడ్ కి వంగి చేతిని వీలైనంత కిందగా చెయ్యి విసిరి మెడ పట్టుకోవాలి." చిన్నగా దాన్ని తోక వైపు కూడా పట్టుకుని బైటకి వెళ్లి పడేసి వచ్చారు. వచ్చాక, ఎలాంటి పాముని ఎలా హేండిల్ చెయ్యాలో నేర్పించారు. హహహ. ఇక నాకు భయం ఎలా అంటుకుంటుంది? 

చెప్పుకుంటూ పోతుంటే చాలానే ఉంటుంది. మొన్నామధ్య ఇరవై అడుగుల దూరంలో అనకొండ కనిపిస్తే ఫోటో తీశాను. దాన్ని నాన్నకి చూపించినప్పుడు ఆయన నవ్వారు. "నా కూతురువి కదా...!" అన్న భావం కళ్ళలో కదలాడింది. 
***   ***   ***

ఎంత బిజీ అయినా, ఎన్ని పనులున్నా, భోజనాల దగ్గర మాత్రం ఒక్కచోటే కల్సి తినే వాళ్ళం. ఎక్కడున్నా రోజుకోక్కసరైనా పలకరించుకున్టాము అందరామూనూ. మేము, మా అనే భావన ఎంత బలాన్ని ఇస్తుందో, మన వాళ్ళు మన వెనకే ఉంటారు అన్న ఆలోచన ఎంత ధైర్యాన్ని ఇస్తుందో నాన్న మాటలతోనే కాదు. చేతలతో కూడా చూపే వారు. ఆ యూనిటీ మమ్మల్ని ఎప్పుడూ ముందుకి నడిపిస్తూనే ఉంటుంది. క్షణ క్షణానికీ పెరిగే నాన్న ప్రేమలా...

HAPPY BIRTHDAY నాన్నా! లాంగ్ లివ్...

నాన్నతో చాట్ చేస్తూ ఏదో అల రాసేశాను. బాగున్న లేకున్నా నాన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ గొప్పదే. అసలే నాన్న కూతురుని. నాకు తెలుసు నాన్న ప్రేమంటే ఏంటో ఎంతో!