కాస్త అల్లరి నేర్చుకోమ్మా, అని మా చంటోడు బుడుగు పుస్తకమిచ్చాడు ఆమధ్య. కొంచం కొంచం చదువుతుంటే ముళ్ళపూడి వారి శైలి నాకు బాగా నచ్చటం మొదలైంది. తరువాత మా దగ్గరే ఉన్న పుస్తకాల్లో కోతి కొమ్మచ్చి తీసి చదువుతున్నానిప్పుడు. అందులో ఒక చోట తనకి తొమ్మిది మంది తల్లులు అని చెప్పారు.
ఇది నవరాత్రి సమయం కదా... నాకు కూడా బాగా ఇష్టమైన స్త్రీల గురించి (నా జీవితంలో ఆప్యాయతలు పెనవేసుకున్న వాళ్ళు) రాద్దామనిపంచింది చదివాక.
*** *** ***
1. అమ్మ అమ్మంటే ఎవరికైనా ఇష్టమే కానీ, నాకు అస్సలు తెలియదు. అమ్మ గురించి. అమ్మని చూసిన వాళ్ళు చెప్పే మాటలని బట్టీ నేను అమ్మలానే ఉంటానని. చాలా మృదు స్వభావమని విన్నాను.
ఈ సంవత్సరం అమ్మ పుట్టినరోజప్పుడు మొదటి సారి నాన్న నాకు అమ్మ ఫొటోని చూపించాడు. పట్టుచీరెలో చాలా అందంగా ఉంది. తిరునామం పెట్టుకుని ఉంది. నాకూ ఆ అలవాటుందనుకోండీ. ఎక్కడికెళ్ళినా మెయింటెయిన్ చేస్తాను. నేను అమ్మ నోట్లోంచీ ఊడిపడ్డాను, అని మాత్థ్యూస్ అంకుల్ చెప్పే మాటలు నిజమనిపించాయి.
2. జాక్వెలైన్ మాత్థ్యూస్ ప్రొఫెసర్ ఇగోర్ మాత్థ్యూస్ (నాన్న స్నేహితులు, మాకు చాలా ఆప్తులు. వయసు కూడా చాలా ఎక్కువే. ఎనభై ఆరు. ఐనా మేము మాత్థ్యూస్ అంకుల్ అంటాము. ఆంటీకి ఎనభై నాలుగు దాదాపూ) సతీమణి. నన్ను చిన్నతనంలో పెంచటానికి మా ఇంటికొచ్చారు. నాకు ఆరునెలలు వచ్చి, నాన్నకు కాస్త పిల్లల విషయాలు బాగా అర్ధమయి, ఇక స్వయంగా ఏ ఇబ్బందులూ లేకుండా చూసుకోగలరు అన్న దాకా ఆవిడ మా ఇంట్లో ఉన్నారు. అమ్మ పోయిన విషయం తెలిసి, జర్మనీ నుంచీ వచ్చి సేవ చేశారు. ఏమిచ్చి కృతఙ్ఞతలు చెప్పుకోగలను? ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవనం గడుపుతున్నారు.
శ్రీకృష్ణాష్టమికి ఇండియా వచ్చినప్పుడు కలిస్తే కొత్త పెళ్ళి కూతురుగా నన్ను చూసిన ఆనందం... మా అమ్మ కూడా అలానే భావించేదేమో అనిపించింది. మీ అమ్మ లాగా నెమ్మది కాదు నువ్వు. మీ నాన్న లానే దూకుడెక్కువ. అంటారెప్పుడూ. పక్కింటి రమాదేవి గారిని పిలిపించి మా ఇద్దరికీ బట్టలు పెట్టించారు. (బొట్టు పెట్టేందుకు లేదని ఆ ఏర్పాటన్నమాట. ఖరీదైన బట్టలే కానీ, ఆంటీ ప్రేమ ముందవన్నీ దిగదుడుపే! :) కాదంటారా?)
3. వందనా మేడం చిన్నతనంలో నా ఎడమచేతి వాటాన్ని నిరశిస్తూ ఒక టీచర్ చాలా ఇబ్బంది పెట్టేది. ఎందుకనో నా మీద ప్రత్యేకమైన ద్వేషం ఉన్న దానిలా ప్రవర్తించేది. ఒకసారి ఆవిడ కొట్టిన దెబ్బలకి నేను చాలా బాధపాడాల్సి వచ్చింది. అప్పుడు నాన్న కంఫ్లెయింట్ ఇస్తే, ఆవిడ బదులు వచ్చినావిడ. నిజంగా ఒక టీచరంటే ఎలా ఉండాలో ఆవిడని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా తీసుకునేలా ప్రోత్సహిస్తూ, ఎవరన్నా నా ఎడమచేతి వాటం గురించి కామెంట్స్ చేస్తే వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉండేవారు. ఆ టైమ్ లో మా పిల్లలందరికీ ఆవిడంటే చాలా ఇష్టం. మా బా౨చి కాంగానే, వాళ్ళాయనకి బాం౨కు జాబ్ వచ్చింది. వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ టీచరంటే ఇలా ఉండాలి అని ఒక రూపమివ్వాల్సి వస్తే నేను ఆవిడ ఫొటోనే ఇస్తాను. ఆ తరువాత చాలా కాలం కనపడలేదు కానీ, మళ్ళా నేను డెల్లీలో చదువుకునేందుకు వెళ్ళినప్పుడు అక్కడ సెటిల్ అయ్యారట. అక్కడ కనిపించారు. వారానికోసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటమో, ఆవిడ మా రూమ్స్ కి రావటమో జరిగేది. నాకు హోమ్ సిక్నెస్ లేకపోవటానికి కారణం కూడా ఆవిడే :) (ఎందుకంటే ఇంటర్మీడియేట్ వరకూ నాన్ననెప్పుడూ విడిచి ఉండలేదు. ఒక్కటంటే ఒక్క రోజు కూడా)
వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకునేవారు. కృష్ణాష్టమి తరువాత యూఎస్ తిరిగి వచ్చే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీస్సులందుకున్నాము.
4. వైదీ ఒకప్పుడు టాప్ టెన్ క్రీడాకారిణి ఐనందుకో, లేక పోతే నాకు మంచి స్నేహితురాలు ఐనందుకో, చెప్పుకునేందుకు గొప్పగా ఉంటుందనో కాదు. తనలో ఉన్న కొన్ని క్వాలిటీస్ నాకు బాగా నచ్చాయి. వాటిలో తన చిట్టి తమ్ముళ్ళు ఆలివర్ అండ్ టోబీలను ప్రేమగా, బాధ్యతగా చూసుకోవటం ఒకటి. టెన్నిస్ అంటే ఆసక్తి సన్నగిల్లి, ఈ సంవత్సరం రిటైరైనా, చక్కని క్రీడాకారిణి.
సరిగ్గా మా పెళ్ళయ్యాక ఆరు రోజులకి తను కూడా పెళ్ళి చేసుకున్నది. టెన్నిస్ ఆవల ఉన్న జీవితాన్ని అనుభవించాలనే తన ఆలోచన ఆసక్తిదాయకం.
ఇతర సూపర్ స్టార్లు కిమ్ క్లైయ్‍స్టర్స్, జస్టిన్ హెనిన్లలా తను కూడా మరలా ఆటలోకి రావచ్చేమో కానీ, పిల్లల మీద తనకున్న మమకారం నాకు తెలుసు. జీవితాన్ని తీర్చి దిద్దుకునే పనిలో ఉందిప్పుడు. సామాజిక సేవలో కూడా ముందుంది. ఆఫ్రికన్ బాలలకు పరిశుభ్రమైన తాగునీరు అందటానికి కృషి చేస్తున్న ఒక సంస్థకి తన వంతు సహకారాన్ని అందిస్తోంది.
5. పూల మామ్మ చెన్నైలో ఉన్నప్పుడు నాకు ప్రతిరోజూ పూలు తెచ్చిచ్చే మామ్మ తను. చాలా దూరం నుంచీ వచ్చి నాకు పొద్దున్నే పూలు, తులసి తెచ్చిస్తుంది. మరియమ్మ ఆవిడ పేరు. నేను ఊళ్ళో లేక పోతే గుళ్ళో నా పేరు మీద ఇచ్చి వెళుతుంది. మా వివాహం సందర్భంగా నాగపట్నంలో వేళాంకిణి మాత ఆలయంలో పూజలు చేయించి ఆశీస్సులందంచింది. వల్లియమ్మాళ్ అంటూ నన్ను పిలిచే ఆమె ఆప్యాయతకు... చెప్పలేను :)
6,7. శైలజమ్మ , కికి చంటి స్నేహితుడు నరసింహన్ వాళ్ళ అక్క. శైలజా రామనాథన్! 2009 బర్త్డే గిఫ్ట్ గా చంటి తీసుకొచ్చిన అమ్మ పాలు ఆవిడవే. ఇక్కడిచ్చిన లింక్ చదవండి అర్ధమవుతుంది. అంతటితోనే అనుబంధం ముగియలేదు. నిరుడు నాకు హార్టాపరేషన్ జరిగినప్పుడు చంటి పిల్లతో సహా వచ్చి నేను హాస్పిటల్లో ఉన్నన్నిరోజులూ నా దగ్గరే ఉన్నారు. మీకు ఇబ్బంది కదా అంటే..., "కికి ఈ పరిస్థితిలో ఉంటే వదిలేసి దూరంగా ఉంటానా? నేనక్కడ విషయం తెలిశాక ఉండలేకపోయా," అన్నారు. ఇంతా చేస్తే ఆవిడకి పెద్ద వయసు కూడా కాదాయే! చంటికన్నా రెండేళ్ళు పెద్ద అంతే. మొత్తం పదిరోజుల పైనే ఉన్నారప్పుడు. నాకు ఓపిక వచ్చాక, నా పుట్టిన రోజుని కూడా జరిపించి మరీ వెళ్ళారు. మనసు పులకరింత అనేది ఎలా ఉంటుందో శైలజమ్మని తల్చుకుంటే బాగా అనుభవంలోకి వస్తుంది. మొన్న వెళ్ళినప్పుడు వదిలి రావాలనిపించనంత బాగా చూశారు.
నా చెల్లి కాని చెల్లి, బంగారు తల్లి కికి. శైలజమ్మ కూతురు. ఇంకా రెండేళ్ళు రాలేదు. నాకోసమని వాళ్ళు వచ్చినప్పుడు బాగా అలవాటైంది. నేనంటే చాలా ఇష్టం. మొన్నామధ్య ఇండియా వచ్చినప్పుడు నేను పని ఉండి చెన్నై వెళ్ళాను. చంటి తన పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళితే నన్ను తీసుకురాలేదని పెద్ద యుద్ధం చేసిందట. పరిగెత్తుకుని రమ్మని చెప్పాడు. వెళ్ళి చూసేశా. పరిగెత్తుకుని కాదనుకోండీ. దాదాపూ ఆరొందల యాభై కిలోమీటర్లు పరిగెత్తటం చాలా కష్టం కదా... :) నేనున్న రెండు రోజులూ అంటిపెట్టుకునే ఉంది చిట్టితల్లి :)
8. చంటీ వాళ్ళ అమ్మ/అత్తగారు పల్లెటూరి అమాయకత్వం, ఆప్యాయతాభిమానాలూ మూర్తీభవించాయావిడలో. ఇంత వరకూ కలిసున్నది నాలుగు గంటలలోపే కానీ, ఫోన్లలో మాట్లాడినది కానీయండి, వేరే విధంగా ఐనా కానీయండి, నా మనసుకి బాగా దగ్గరయ్యారు. ఆవిడ మంచితనం, ఉన్న కాసేపటిలోనే ఆవిడ చూపిన ఆప్యాయత అపూర్వం. చంటి దూకుడిని తట్టుకున్నారంటేనే ఆవిడ సామర్ధ్యం తెలుస్తుంది. వాళ్ళిద్దరి అనుబంధం చాలా తమాషాగా ఉంటుంది. అమ్మైనంత మాత్రాన నేను తప్పు చేసినప్పుడు కూడా నన్ను వెనకేసుకుని రావాలా? అంటాడు తను. నా పిల్లాడిని నేను కాకుండా వేరెవరు వెనకేసుకుని వస్తారు? అని ఆవిడ. చిన్న పిల్లలకి చెప్పినట్టు తను ప్రవేటు చెప్పినా, ఓపిగ్గా తనకి కావాల్సినవన్నీ అందించే, తన కోసం తపన పడే అమ్మని తను ప్రేమించే విధానం చూస్తేనే తెలుస్తుంది, నన్నంత గొప్పగా ఎలా చూడగలుగుతున్నాడో అని. అన్నం కలిప్పెట్టి (తను ఎప్పుడూ కలిపే పెట్టించుకుంటాట్ట), ఒళ్ళో పడుకోపెట్టుకుని, పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోమ్మా, వాడసలే తిండి సరిగ్గా తినడు, వేళకి పడుకోడు, అన్ని విషయాలు తెలియదు, అంటూ ఒక ఆడపిల్లని అప్పగించనట్టు అమాయకంగా చెపుతుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. మా అమ్మ ఉంటే తనకి కూడా నా గురించి ఇలాగే చెప్పేదేమో అనిపించింది...
ఇలా ఒక్కొక్కళ్ళ గురించీ చెప్పటానికి ఎన్ని మాటలైనా సరిపోవు. ప్రేమాభిమానాల్ని పంచి పెట్టే వీళ్ళంతా నా వాళ్ళు.
9. పేరు చెప్పను కానీ, నిరుడు ఈరోజుల్లోనే ఒక బంధం ఎందుకోగానీ దెబ్బతింది. ఐనా ఆవిడ పంచిన ప్రేమ తక్కువేమీ కాదు. మనిషి దూరమైనా, మనసులెప్పుడూ దూరం కావు. అపార్ధాలూ, అవీ ఎన్నాళ్ళుంటాయి? నా పిల్లలకి నలుగు పెట్టి స్నానాలు చేయిస్తానన్నారావిడ. చూద్దాం! ఏమవుతుందో...
నా వాళ్ళందరికీ నవ దుర్గల అనుగ్రహం ఈ దసరా శరన్నవరాత్రుల్లో కలగాలని నవరాత్రుల సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ...
సృజన
వైదీ పెళ్ళి ఫొటో నెట్లో ఐనా దొరకొచ్చు. నాకు మెయిల్లో వచ్చింది. మొదటిది మాత్రం నెట్లోంచీ తీసుకున్నది. వారికి ధన్యవాదాలు...
వైదీ పెళ్ళి ఫొటో నెట్లో ఐనా దొరకొచ్చు. నాకు మెయిల్లో వచ్చింది. మొదటిది మాత్రం నెట్లోంచీ తీసుకున్నది. వారికి ధన్యవాదాలు...




